ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో సీపీ అంజనీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల నివాసం వద్ద భద్రతను పర్యవేక్షించిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించవద్దని, ఆర్టీసీ కార్మికులను హెచ్చరించారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలు, రాస్తారోకోల పేరుతో ప్రజలను ఇబ్బంతే ఊరుకోబోమని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. మంత్రుల నివాసాల ముట్టడి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో సోమవారం (నవంబర్ 11) ఉదయం నుంచే మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ట్యాంక్ బండ్ వద్ద జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా ఆర్టీసీ జేఏసీ.. ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ పిలుపు అందుకొని కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఇళ్లను ముట్టడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో కార్మికులు గాయపడ్డారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే నామా నాగేశ్వరావు ఇంటి ముందు బైఠాయించి ఆర్టీసీ కార్మికులు, తదితర పార్టీ నాయకులు నిరసన తెలిపారు. సిద్ధిపేటలోని మంత్రి హరీశ్ రావు నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆర్టీసీ నేతలతో పాటు, సీపీఎం, సీపీఐ నాయకులు ఈ ముట్టడిలో పాల్గొన్నారు. హరీశ్ రావు ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఓ మహిళా కండక్టర్ గాయపడ్డారు.
హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామ్‌నగర్‌లోని ఆయన ఇంటి ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇళ్ల ముట్టడి కార్యక్రమం కూడా ఉద్రిక్తతలకు దారితీసింది.