తలల్లో పేలు పీడను వదిలించుకోవాలంటే...

Durga
తలల్లో స్థిర నివాసం చేసుకుని ఉండే పేలు పీడను వదిలించుకోవాలంటే... 1. మెంతులను నానపెట్టి మెత్తగా రుబ్బి, ఆ ముద్దలో హారతి కర్పూరాన్ని కలిపి తలకు పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి. 2. వేపాకును, మెంతి ఆకును మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి గంటా, గంటన్నర అయిన తర్వాత తలస్నానం చేయాలి. 3. కొబ్బరి నూనెలో వేపగింజలను వేపాకును వేసి కాచి, దాన్ని వడకట్టి ప్రతిరోజూ ఆ నూనెను జుట్టు కుదుళ్ళల్లోకి ఇంకేలా మసాజ్‌ చేసినట్లయితే పేలు చచ్చిపోతాయి. 4. తలస్నానానికి సీకాయపొడి, కుంకుడురసాన్ని వాడాలి. 5. మెంతి ఆకులను లేదా వేపాకులను మెత్తగా నూరి, అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే పేలు చనిపోతాయి. 6. పేలను సంహరించే మందులు ద్రవరూపంలోనూ, క్రీమ్‌ రూపంలోనూ మెడికల్‌ షాపుల్లో దొరుకుతాయి. వాటిని రాత్రి పడుకోబోయే ముందు తలకు పట్టించి, జుట్టంతా కవరయ్యేలా తలకు చిన్న తువ్వాలను చుట్టుకుని ఉదయం నిద్రలేవగానే తలస్నానం చేస్తే, పేలతో పాటు వాటి గుడ్లు నశించిపోతాయి. 7. దువ్వెనలలో మురికి చేరకుండా దువ్వెన పళ్ళను శుభ్రపరుస్తూండాలి. అంతేకా కుండా వారానికి ఒకసారి మరుగుతున్న నీటిలో దువ్వెనను నానపెట్టి శుభ్రపరచాలి. 8. తలగడను ఎండలోవేస్తూ, గలీబులను వేడి నీటిలో నానపెట్టి ఉతకాలి. డెట్టాల్‌ కలిపిన నీటిలో జాడించి, ఎండలో ఆరెయ్యాలి. 9. తలలో పేలున్నవారు వారానికి రెండుమూడుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానానికి ముందు కాకర రసంకానీ, నిమ్మరసంకానీ తలకు పట్టించాలి. 10. జుట్టు జిడ్డుగానూ అపరిశుభ్రంగానూ లేకుండా వెంట్రుకల పరిశుభ్రతను పాటించాలి.  11. నాలుగు పెద్ద వెల్లుల్లి రేకలను మెత్తగా పేస్టులాగా చేసి, ఒక టీస్పూన్ నిమ్మరసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయ్యాక తలకు కాటన్ టవల్ చుట్టి రాత్రంతా అలాగే ఉంచేయాలి. ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా రోజు మార్చి రోజు... ఐదు రోజులపాటు చేసినట్లయితే పేలు, వాటి తాలూకు గుడ్లు పూర్తిగా నశించిపోతాయి. 12, అరకప్పు నీటిలో రెండు టీస్పూన్ల వైట్ వెనిగర్ కలిపి అందులో దూదిని ముంచి తలకు పట్టించి జట్టు కుదుళ్లకు, మాడుకు బాగా పట్టేటట్లుగా మసాజ్ చేయాలి. తరువాత కాటన్ టవల్ చుట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం మామూలుగా తలస్నానం చేయాలి. 13. ఉల్లిపాయలను మెత్తగా చేసి, రసాన్ని తలకు పట్టించి, తలను క్యాప్‌తోగానీ, క్లాత్‌తోగానీ కవర్ చేసేయాలి. అలాగే నాలుగు గంటలపాటు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా మూడు రోజులపాటు చేసినట్లయితే పేల బెడద పూర్తిగా వదలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: