సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!

Edari Rama Krishna
శరీరంలోని అనవసర కొవ్వును కరిగించుకోవడానికి మాత్రమే కాదు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా పారదోలి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలోనూ 'సూర్య నమస్కారాలు' కీలక పాత్ర పోషిస్తాయి. ఇవీ వ్యాయామంలో ఒక భాగమే. ఉదయాన్నే లేచి సూర్యుడి వైపు తిరిగి వందనం చేస్తూ చేసే ప్రక్రియ. ఇవి మొత్తం పన్నెండు ఆసనాలుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల.. అందులోని విటమిన్ 'డి' ఎముకలను బలంగా చేయడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారాల వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చూద్దాం రండి..

• పరగడుపునే...
సూర్య నమస్కారాలు చేసే క్రమంలో పొట్ట భాగంపై ఒత్తిడి పడడంతో పాటు ఆ భాగం బాగా సాగుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. కాబట్టి ఎవరైతే అజీర్తి, మలబద్ధకం.. వంటి సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వాళ్లు ఉదయాన్నే పరగడుపున సూర్య నమస్కారాలు సాధన చేయడం వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి పొందచ్చు.

• కండరాలు దృఢంగా...
సూర్య నమస్కారాల వల్ల పొట్ట, చేతి కండరాలు, భుజాలు, ఛాతి, వెన్నెముక.. వంటి భాగాలు దృఢంగా తయారవడంతో పాటు నడుం ఎటు పడితే అటు వంగడానికి అనువుగా తయారవుతుంది. అలాగే ఈ వ్యాయామం వల్ల చర్మంపై ఉండే ముడతలు కూడా తగ్గిపోయి నవయవ్వనంగా కనిపించే అవకాశం ఉంటుంది.

• వ్యర్థాల తొలగింపు...
సూర్య నమస్కారాల్లో గాలిని గాఢంగా లోపలికి పీల్చి వదిలే ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ క్రమంలో జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసల వల్ల వూపిరితిత్తులు శుభ్రపడడంతో పాటు రక్తం ఆక్సిజనేట్ అవుతుంది. తద్వారా శరీరంలో ఉండే కార్బన్ డయాక్సైడ్, ఇతర విషవాయువులన్నీ బయటికి వెళ్లిపోతాయి.

• బరువు తగ్గచ్చు...
సూర్య నమస్కారాల వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు దృఢంగా తయారవడంతో పాటు థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. అలాగే ఈ వ్యాయామం వల్ల మన శరీరంలోని అనవసర కొవ్వులు కూడా కరిగిపోయి తద్వారా నెమ్మదిగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

• మానసిక ఆరోగ్యానికి...
ఈ వ్యాయామం వల్ల నాడీవ్యవస్థ పనితీరు మెరుగవడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఆందోళనలు, ఒత్తిళ్లు.. వంటివి తగ్గిపోయి మానసిక ప్రశాంతత కూడా సొంతమవుతుంది. రాత్రుళ్లు నిద్ర కూడా బాగా పడుతుంది. కాబట్టి రోజూ ఉదయం కనీసం అరగంట పాటు సూర్యనమస్కారాలను సాధన చేయడం అలవాటు చేసుకోవాలి.

• చక్కటి శరీరాకృతికి...
కొందరికి.. శరీరంలో పైభాగం సన్నగా ఉంటే.. నడుము కింది భాగం కాస్త లావుగా కనిపిస్తుంటుంది; అలాగే మరికొంత మందికి పైభాగం కాస్త లావుగా ఉండి.. కింది భాగం సన్నగా ఉండచ్చు.. ఇలా పైనుంచి కింది వరకు శరీరాకృతిలో చిన్న చిన్న లోపాలుండడం వల్ల అది అందంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి వారు రోజూ సూర్య నమస్కారాలు సాధన చేయడం వల్ల మంచి శరీరాకృతి సొంతమవుతుంది.అలాగే ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు సరైన రక్తప్రసరణ జరుగుతుంది. తద్వారా రోజంతా శక్తిమంతంగా, ఉల్లాసంగా ఉండచ్చు.

• రుతుక్రమం సక్రమంగా...
చాలామంది మహిళలు నెలసరి సక్రమంగా రాకపోవడం, ఆ సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి రావడం.. వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మరి వీటన్నింటి నుంచి విముక్తి పొందాలంటే రోజూ ఉదయం సూర్య నమస్కారాలు సాధన చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల శరీరంలోని హార్మోన్ల స్థాయులు సమతుల్యమవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: