కాలాన్ని బట్టి చర్మ తత్వం కూడా మారుతుంటుంది. దాంతో పాటు వాతావరణం ప్రభావంతో పాటు, కాలుష్యం, దుమ్ము, ధూళి చర్మాన్ని, శిరోజాలని ఎక్కువగా బాధిస్తుంది. ఈ చర్మం, శిరోజాల ప్రభావం కారణంగా ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడుతాయి. వీటితో పాటు చర్మం కాంతిహీనమై నిర్జీవంగా కనిపిస్తుంది. కోల్పోయిన అందాన్ని తిరిగి పొందేందుకు వంట ఇంట్లో ఉపయోగించే వస్తువులే చాలు అంటున్నారు సౌందర్య నిపుణులు.
అందంగా ఉండటానికి ఎన్నో రకరకాల క్రీములను వాడుతూ వుంటారు. వాటి వల్లే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధపడుతుంటారు. అందుకే క్రీముల కంటే అమ్మలు, అమ్మమ్మలు వాడమని చెబుతున్న సున్నిపిండిలోనే ఎన్నో సుగుణాలున్నాయి.
- సున్నిపిండి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ముఖంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తొలిగిస్తుంది.
- చర్మ సమస్యలను నివారించే లక్షణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.
- సున్నిపిండిలో రెండు స్పూన్ల నెయ్యి, రెండు స్పూన్ల పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
- రెండు చెంచాల సున్నిపిండిలో నాలుగు చెంచాల పాలు, రెండు చెంచాల రోజ్‌వాటర్ కలపాలి.. ఆ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శభ్రం చేసుకుంటే ముఖానికి ఉన్న జిడ్డు తొలగిపోతుంది.
- సున్నిపిండిలో కొద్దిగా పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
- సున్నిపిండిలో తులసి, వేపాకుల పొడిని వేసి కలిపి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి, ముఖానికి ప్యాక్ వేసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల ముఖం కాంతివంతంగా, ఆకర్షణీయం కనిపిస్తుంది.
- సున్నిపిండిలో కొద్దిగా పెరుగు కలిపి, దానిని జుట్టుకు రాసుకొని, ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.
- ఇక ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నేచురల్ లుక్ సొంతం చేసుకోవచ్చు.