ముఖానికి పుదీనా ఫేస్ ప్యాక్ వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!
పుదీనా అటు ఆరోగ్య పరంగా, ఇటు సౌందర్య పరంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా కేశాలను ఒత్తుగా చేయడానికి కూడా ఈ పుదీనా ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పుదీనా ఆకుల రసాన్ని తాగినా లేదా ముఖానికి రాసినా లేదా జుట్టుకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మన శరీరానికి కావలసిన తాజాదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే ఈ పుదీనా ఆకులతో తీసిన రసాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లో వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుదీనా లోని సౌందర్య గుణాలు చర్మాన్ని నునుపుగా,కాంతివంతంగా మారుస్తాయి. పుదీనా బ్లాక్ హెడ్స్, మొటిమలు, దురద, మంట , యాక్నే వంటి సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది. ఈ ఎండాకాలంలో మరీ ముఖ్యంగా ముఖం పై నల్లటి వలయాలు ఏర్పడి, అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి అలాంటి వారికి ఈ మింట్ ఫేస్ ప్యాక్ ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా వేసవికాలంలో దురద, మంట లాంటివి పుడుతూ ఉంటాయి కొంతమందిలో.. అలాంటి వారు ఈ పుదీనా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చల్లదనంతో పాటు తాజాగా ఉంటుంది.
ఇందుకోసం తాజా పుదీనా ఆకులు 25 గ్రాములు, ముల్తానీ మట్టి ఒక టేబుల్ స్పూన్ , తాజా పెరుగు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.. ఈ ఆకులు మొత్తం గ్రైండ్ చేసి మెత్తగా చేయాలి. ఆ తర్వాత అందులో ముల్తానీ మట్టి, పెరుగు వేసి అరగంట సేపు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా చిలికినట్టుగా కలిపి, ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత బాగా ఆరిన తర్వాత ముఖాన్ని ముందుగా గోరు వెచ్చని నీటితో కడగాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
పుదీనా ఆకులు సాధ్యం కానప్పుడు మార్కెట్లో దొరికే మింట్ పౌడర్ ను కూడా వాడుకోవచ్చు. అలాంటప్పుడు ఈ ప్యాక్ కు ఒక టేబుల్‌స్పూన్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సాధ్యమైన వాళ్ళు తాజా పుదీనా ఆకులను ఈ వేసవిలో ఎండబెట్టి ఏడాదంతా వాడుకోవచ్చు. మొటిమలు, గీతలు ఎక్కువగా ఉంటే మింట్ జెల్ ముందు ముఖానికి రాసి పది నిమిషాల మర్దనా చేయాలి. ఆ తరువాత పొడి చర్మం అయితే మింట్ ఫేషియల్ క్రీములు లేదా ఏదైనా ఫ్రూట్ ఫేసియల్ క్రీమ్ రాసి మర్దన చేసిన తర్వాతనే ప్యాక్ వేసుకోవాలి...