సినీ పాకుడురాళ్ల అంచున సిల్క్ స్మిత (డిసెంబర్ 2 సిల్క్ స్మిత పుట్టిన రోజు)

Hareesh
ఒకప్పటి సినీ జర్నలిస్ట్, రచయిత రావూరి భరద్వాజ  పాకుడు రాళ్లు పేరుతో సినీ జీవులపై ఓ నవల రాశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి సినీ సంభాషణల రచయిత ఎన్ఆర్ నంది సినీ జనారణ్యం పేరిట సినీ జీవిత విషాదాలను నవలీకరించారు. అప్పటికీ, ఇప్పటికీ రోజులు మారినట్లనిపించినా...మహిళా ఆర్టిస్ట్ ల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదనే చెప్పాలి. కారణం...అటు గ్లామర్ ప్రపంచం...ఇటు పురుషాధిక్యత వెరసి వెండితెరపై అందాల ఆడబొమ్మలకు అడుగడుగునా అష్ట కష్టాలే. అలాంటి కష్టాలను తాళలేక విరక్తితో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడితే...మరికొంతమంది అనుక్షణం కుమిలిపోతూ బతుకుతూనే ఉన్నారు. అలాంటి విషాదాంత జీవితానికి నిలువెత్తు దర్పణంలా నిల్చుంది సిల్క్ స్మిత.
సైలెన్స్, స్టార్ట్ కెమెరా అనే పదబంధాల గ్లామర్ పంజరంలో చిక్కిన విషాదాంత జీవితం సిల్క్ స్మిత సొంతం.
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. 1960 డిసెంబర్ 2న జన్మించారు. 1996, సెప్టెంబర్ 23న మరణించారు. సిల్క్ స్మిత ప్రధానంగా దక్షిణ భారత సినిమాలలో నటించారు. మొదట సైడ్ యాక్ట్రెస్ గా సినీ జీవితం ప్రారంభించి నటించారు.


'వండి చక్రం'తో సిల్క్ గా స్మిత గా
1979వ ఏడాదిలో 'వండి చక్రం' అనే తమిళ సినిమాలో 'సిల్క్' అనే పాత్రతో మొదటగా గుర్తింపు సంపాదించుకున్నారు. 1980లలో అత్యంత డిమాండ్ ఉన్న ఎరోటిక్ నటిగా గుర్తింపు పొందారు. 17 సంవత్సరాల సుదీర్ఘ సినిమా కెరీర్ లో, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో మొత్తం 450 సినిమాలకు పైగా నటించారు. సెప్టెంబర్ 23న చెన్నైలోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకొన్నారు.


స్మిత తల్లి తండ్రులు రామల్లు, సరసమ్మ దంపతులు.  ఏలూరులో ఆమె జననం. డబ్బు ఇబ్బందుల కారణంగ్గా ఆమె  నాలుగో తరగతితో చదువు ఆపేసారు. అయితే, ఆమె అందం మాత్రం పదిమందినీ యిట్టె  ఆకర్షించేది. ఆమెది బాల్య వివాహం.  చాలా చిన్న వయస్సులోనే స్మితకు వివాహం చేసేశారు ఆమె తల్లిదండ్రులు. భర్త, అత్తామావయ్యలు స్మితను వేధింపులకు గురి చేశారు. దాంతో, ఇంటి నుంచి స్మిత పారిపోయి కొత్త జీవితాన్ని వెతుక్కున్నారు. అదే సినీ జీవితమైనది.


కెరీర్టచ్ అప్ ఆర్టిస్ట్ గా స్మిత తన కెరీర్ ను మొదలుపెట్టిన సిల్క్ స్మిత  చిన్నపాత్రల్లో కనిపించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఏవీఎం స్టూడియో దగ్గర ఉన్న  ఫ్లోర్ మిల్ డైరెక్టర్ విను చక్రవర్తి దృష్టిలో పడడంతో అతని సంరక్షణలో స్మిత ఉండడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అంది వచ్చిన తమిళ సినిమా 'వండి చక్రం' లో  'సిల్క్' అనే ప్రాధాన్యత ఎక్కువున్న పాత్రలో నటించడం... ఆ తరువాత 'సిల్క్' అనే పదం ఇంటిపేరుగా మారడం చక చక జరిగిపోయాయి.  


ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ..
డాన్సర్ గానే  కాదు...నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా పోషించారు.  స్మిత నటించిన 'లయనం' అనే మలయాళ సినిమా బోల్డంత ప్రాచుర్యాన్ని పొందింది. తర్వాత ఆ సినిమా  ఎన్నో భాషల్లోకి డబ్ అయ్యింది. బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన 'వసంత కోకిల' సినిమా స్మిత కెరీర్ లో అత్యంత కీలకమైన  చిత్రంగా నిలిచింది.

మరణం 1996, సెప్టెంబర్ 23న తన స్నేహితురాలు, ప్రముఖ డాన్సర్ అయిన అనురాధతో తనను బాధపెడుతోన్న అంశం గురించి చర్చించడానికి కాంటాక్ట్ చేశారు. అయితే అప్పుడు అనురాధ తన పిల్లల్ని స్కూల్ కి దిగపెడుతున్నారు. ఆ కారణంగా, స్కూల్ లో తన పిల్లల్ని దిగబెట్టిన తరువాత తనని కలవడానికి వస్తానని అనురాధ స్మితతో అన్నారు. అయితే, అదే రోజు కొన్ని గంటల తరువాత చెన్నైలోని తన ఇంట్లో చనిపోయి ఉన్నారు స్మిత. ఈ విషయం ఆమె అభిమానుల్ని ఎంతో కలవరపెట్టింది. ఇప్పటికీ స్మిత మరణం వెనుక ఉన్న కారణం ఓ మిస్టరీగానే మిగిలింది. కొంతమంది, సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోయినందుకు స్మిత ఆత్మహత్య చేసుకొన్నారని భావిస్తారు. మరికొంతమంది స్మిత ప్రేమించి విఫలమైన కారణంగా సూసైడ్ చేసుకున్నారని అనుకుంటున్నారు. ఆమె మరణించిన కొన్ని నెలలకు పోస్ట్ మోర్టమ్ లో స్మిత తన చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారంటూ రిపోర్ట్ వచ్చింది.


స్మిత జీవితంపై సినిమా 2011లో ప్రముఖ హిందీ నిర్మాత ఏక్తా కపూర్, సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 'ది డర్టీ పిక్చర్' అనే సినిమాని నిర్మించారు. మిలన్ లుథ్రియా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇందులో విద్యాబాలన్ నటించారు. స్మిత పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాని విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషలలో డబ్ అయింది. ఆ చిత్రాలు కూడా స్మిత పుట్టిన రోజు నాడే విడుదల అయ్యాయి.


2013లో, కన్నడ భాషలో సిల్క్ స్మిత జీవితాధారంగా 'డర్టీ పిక్చర్: సిల్క్ సక్కత్ హాట్' అనే సినిమా రిలీజ్ అయింది. ఇందులో పాకిస్తాని నటి వీణా మాలిక్ నటించారు. ఆమె తన అభినయానికి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. కర్ణాటకలో ఈ చిత్రం పెద్ద హిట్టయింది. అదే ఏడాది మలయాళంలో స్మిత జీవిత ఆధారంగా 'క్లైమాక్స్' అనే టైటిల్ తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రలో సనా ఖాన్ నటించారు.

స్మిత నటించిన సినిమాలు తెలుగులోనూ చాలా సినిమాలు చేశారు. 'సీతాకోక చిలుక', 'యమకింకరుడు', 'ఖైదీ', 'గూఢచారి నెంబర్ 1', 'రోషగాడు', 'ఛాలెంజ్', 'రుస్తూం', 'హీరో', 'అగ్నిగుండం', 'చట్టంతో పోరాటం', 'శ్రీ దత్త దర్శనం', 'దొంగ', 'రాక్షసుడు', 'కిరాతకుడు', 'ఖైదీ నెంబర్ 786', 'గీతాంజలి', 'బామ్మా మాట బంగారు బాట', 'ఆదిత్య 369', 'చైతన్య', 'అంతం', 'బావ బావమరిది', 'కుంతి పుత్రుడు', 'గోవిందా గోవిందా', 'రక్షణ', 'ముఠామేస్త్రి', 'పల్నాటి పౌరుషం', 'చిలకపచ్చ కాపురం', 'మా ఆవిడ కలెక్టర్' వంటి పలు చిత్రాలు ఆమె నటనకు అద్దం పడతాయి. ఇన్నాళ్ళకి సిల్క్ స్మిత గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆమె మిగిల్చి వెళ్లిన కదిలే బొమ్మల వల్లనే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: