కెనడా చరిత్రలోనే అత్యంత విషాద ఘటన... గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడి 22 మంది ప్రాణాలు తీసిన యువకుడు...!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో కెనడాలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి అతని గర్ల్ ఫ్రెండ్ కు జరిగిన గొడవ 22 మంది ప్రాణాలను బలిగొంది. పూర్తి వివరాలలోకి వెళితే కెనడాలోని హాలిఫాక్స్ సమీపంలోని డార్ట్మౌత్లో గాబ్రియేల్ కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇటీవల గాబ్రియేల్ కు అతని గర్ల్ ఫ్రెండ్ కు మధ్య గొడవ జరిగింది.
గొడవ అనంతరం కోపోద్రిక్తుడైన గాబ్రియేల్ నోవాస్కోటియా ప్రాంతంలో కాల్పులు జరిపాడు. గాబ్రియేల్ జరిపిన కాల్పుల్లో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒక మహిళా పోలీసు కూడా మృతి చెందటం గమనార్హం. ఇతరులపై గాబ్రియేల్ కాల్పులు జరపటానికి ప్రయత్నించిన సమయంలో కొందరు అతనిపై కాల్పులు జరిపారు. కానీ గాబ్రియేల్ కాల్పుల నుంచి తప్పించుకున్నాడు.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి గాబ్రియేల్ గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడి 22 మందిని చంపాడని చెప్పారు. త్వరలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తామని అన్నారు. గాబ్రియేల్ పోలీస్ దుస్తుల్లో ప్రావిన్స్ పొర్టాపిక్ పట్టణంలో కాల్పులు జరిపి అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలో కాల్పులు జరిపాడు.