కరోనా కట్టడికి తెర ముందు మోదీ తెర వెనక అమిత్ షా... ఏం చేస్తున్నారంటే...?
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. కరోనా సంక్షోభ సమయంలో ఒకవేపు కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తూనే.... మరోవైపు ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. కరోనా విషయంలో మోదీ తెర ముందు నుంచి అన్ని పనులు చేస్తుంటే అమిత్ షా మాత్రం తెర వెనక ఉండి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడానికి అమిత్ షా ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం పని చేస్తోంది. మందులు, నిత్యావసర వస్తువులు, వలసకూలీలకు సంబంధించిన చర్యలన్నీ చేపడుతున్నారు. కిట్లు, వైద్య సంబంధిత సామాగ్రి సరఫరా విషయంలో కూడా ఈ బృందం కీలకంగా వ్యవహరిస్తోంది. తెర వెనుక ఉన్న ఈ బృందం పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ ఈ బృందం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది.
తెరముందు మోదీ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడం, కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి కట్టడికి తగిన నిర్ణయాలు తీసుకోవడం, ప్రముఖ రాజకీయ నేతల నుంచి సూచనలు స్వీకరించడం వంటి విషయాలకు ప్రధాని ప్రాధాన్యత ఇస్తారు. మరోవైపు విదేశాంగ శాఖ విదేశాలతో చర్చలు జరుపుతూ ఆయా దేశాలకు మందులు, ఇతర సామాగ్రి సరఫరా చేస్తోంది.