రైతులకు జగన్ సర్కార్ శుభవార్త... 56 లక్షల క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి ఆదేశాలు?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా రైతులకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ ఖరీఫ్ నాటికి 56 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు డెబిట్ కార్డుల ద్వారా రైతులకు అందేలా చేయాలని చెప్పారు.
ఈ క్రాప్ ను పంట రుణ ఖాతాలకు అనుసంధానిస్తూ వారికి క్రెడిట్ కార్డులు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. క్రెడిట్, డెబిట్ కార్డుల వల్ల రాష్ట్రంలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైతులు సంబంధిత బ్యాంక్ కు వెళ్లి కార్డు చూపగానే బ్యాంకులు డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. సీఎం జగన్ నిన్న రైతు భరోసా కేంద్రాలపై కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
మరోవైపు రాష్ట్రంలో రైతులకు పురుగు మందులు, ఎరువులు అందజేయడం కొరకు 11, 158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జూన్ 1 నుంచి ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.