హంద్వారా కాల్పుల్లో అమరుడైన పట్టువదలని వీరుడు... 13వ ప్రయత్నంలో ఆర్మీకి ఎంపికై ....?
మే 3వ తేదీన ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న పౌరులను క్షేమంగా విడిపించి ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. విధి నిర్వహణలో వీరు చూపించిన ధైర్య సాహసాలను చూసి దేశమంతా సెల్యూట్ చేసింది. ఉగ్రవాదుల కాల్పుల్లో కర్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, జవాన్లు రాజేశ్, దినేశ్, ఎస్ఐ ఖ్వాజీ ప్రాణాలు కోల్పోయారు. ఈ బృందానికి నేతృత్వం వహించిన కర్నల్ అశుతోష్ శర్మ ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొని ఆర్మీలో చేరారు.
బాల్యం నుంచే దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో 12 సార్లు ప్రయత్నించి విఫలమైన అశుతోష్ 13వ ప్రయత్నంలో సైన్యానికి ఎంపికై కలను నెరవేర్చుకున్నాడు. భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో ఆయన పాల్గొన్నాడు. ఇండియన్ ఆర్మీలో 2000 సంవత్సరంలో చేరిన అశుతోష్ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రీయ రైఫిల్స్ లో కర్నల్ స్థాయికి చేరుకున్నాడు. బాల్యం నుంచే దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో అశుతోష్ ఉండేవాడని ఆయన సోదరుడు మీడియాకు చెప్పారు.