ఆలయాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.... తీర్థ ప్రసాదాల విషయంలో కీలక నిర్ణయం...?
కరోనా వైరస్ విజృంభణ వల్ల దాదాపు 2 నెలల నుంచి దేశంలోని ఆలయాలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. ఐదో విడత లాక్ డౌన్ లో భాగంగా కేంద్రం ఈ నెల 8నుంచి దేశవ్యాప్తంగా మరిన్ని సడలింపులను అమలు చేస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థన స్థలాలను తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. తాజాగా కేంద్రం ప్రార్థనా మందిరాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్రం ప్రార్థన మందిరాలల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేరువేరు మార్గాలు ఉండాలని సూచించింది. ప్రవేశ మార్గంలో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి చేసింది. క్యూలైన్లో 2 మీటర్ల భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని... రికార్డు చేసిన భక్తి గీతాలను మాత్రమే వినిపించాలని... ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదని సూచించింది. అన్న ప్రసాదం తయారీ, పంపిణీ సమయంలో భౌతిక దూరం తప్పని సరి చేసింది. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలని... మతపరమైన సమావేశాలు, జనాలు గుంపులుగా చేరే వేడుకలపై నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది.