గాంధీ విగ్రహ ఘటనపై స్పందించిన ట్రంప్.... అవమానకరం అంటూ వ్యాఖ్యలు...?
జాత్యహంకార వ్యతిరేక నిరసనలతో అగ్రరాజ్యం అమెరికా గత కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. జార్జి ఫ్లాయిడ్‌ను పోలీసులు హత్య చేయడంతో అగ్రరాజ్యంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గుర్తు తెలియని దుండగులు చేసిన దాడుల్లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసమైంది. తాజాగా ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఈ ఘటన అవమానకరమైన సంఘటన అని అన్నారు. ఈరోజు వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. విగ్రహాన్ని కొందరు వ్యక్తులు అపవిత్రం చేశారంటూ భారత రాయబార కార్యాలయం వాషింగ్టన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగుల దుశ్చర్య విషయంలో భారత్‌ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వారి నుంచి హామీ వచ్చింది. ఇలాంటి ఘటనలు విచారకరం అంటూ ట్రంప్ సలహాదారు కింబర్లీ గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.