మహారాష్ట్రలో లక్ష దాటిన కరోనా కేసులు.... భయాందోళనలో ప్రజలు...?
దేశంలో కరోనా రక్కసి ఉగ్ర రూపం దాలుస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటగా గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో 3493 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటినట్లు కీలక ప్రకటన చేసింది.
నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,01,141కి చేరింది. గత 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోవడంతో కరోనా మరణాల సంఖ్య 3,717కు చేరింది. రాష్ట్రంలో 47,793 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 51,455 మంది వేరువేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు, మరణాలు ముంబైలోనే ఉండటం గమనార్హం. ముంబై సిటీలో ఇప్పటి వరకు 55,451 మంది వైరస్ సోకగా... 1954 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు.