బ్రేకింగ్ : చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణలకు ఏపీ సర్కార్ షాక్.... లీగల్ నోటీసులు....?
ఏపీ ప్రభుత్వం చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలకు షాక్ ఇచ్చింది. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ నుంచి అసత్య అభియోగాలు మోపిన చంద్రబాబు, తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై పరువునష్టం దావా వేయడంతో పాటు ప్రభుత్వం తీసుకునే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబుతోపాటు ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు), ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)కి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచురించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం నిబంధనల ప్రకారం గుంటూరు జిల్లాలో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు సున్నపురాయి మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని.... ఈ ఉత్తర్వులపై అభియోగాలు మోపడంతో పాటు తప్పుడు కథనాలు ప్రచురించినందుకు 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు లేనిపక్షంలో చట్టపరంగా ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ చంద్రబాబుతోపాటు రెండు సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశామని అన్నారు.