జగన్ కు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైన నిమ్మగడ్డ....?

Reddy P Rajasekhar

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో నిమ్మగడ్డ విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవులతో ఆడుకోవద్దని.... ఆర్డినెన్స్ తేవడంలో ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ అభిప్రాయపడింది. 
 
ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించటానికి నిరాకరించింది. నాలుగు రోజుల క్రితం ఏపీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు పరోక్షంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల అధికారిగా నియమించి ఉంటే బాగుండేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వం పదవిలో నియమించకపోవడంతో నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేయబోతున్నారు. ఈ పిటిషన్ ను దాఖలు చేస్తే ప్రభుత్వానికి మరో కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. జంధ్యాల శంకర్ అనే న్యాయవాది ఈ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చారు. 
 
కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం వెంటనే నిమ్మగడ్డను పదవిలోకి తీసుకుంటుందా....? లేక కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసినా పరవాలేదని ముందుకెళుతుందా...? చూడాల్సి ఉంది. నిమ్మగడ్డ వ్యవహారంలో వరుసగా ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందో తెలియాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: