తెలంగాణలో కరోనా విశ్వరూపం... ఒక్కరోజే 872 కేసులు...?
తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 872 మంది వైరస్ భారీన పడ్డారు. నమోదైన కేసుల్లో 713 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. లాక్ డౌన్ సడలింపులే రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,674కు చేరగా మృతుల సంఖ్య 217గా ఉంది.
రాష్ట్రంలో 4005 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 4,452 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో కేసులు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపైకి అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు మాస్క్ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లే ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.