నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు వీఐపీ పుష్కరఘాట్ వద్ద స్నానం చేస్తుండగా ఏడుగురు గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు స్థానికులు గోదావరిలోకి దూకి ఒక బాలుడిని కాపాడారు. ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతావారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారిలో నిజామాబాద్ ఎల్లమ్మగుట్టకు చెందిన యోగేష్, బొబ్బిలి శ్రీనివాస్, శ్రీధర్, జీలకర్ర సురేష్, శ్రీకర్, దొడ్లే రాజుగా గుర్తించారు. ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు చుట్టుపక్కల గ్రామాలను ప్రజలు భారీసంఖ్యలో వస్తుంటారు. గల్లంతైనవారి కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు హృదయవిదారకంగా రోదిస్తుండటం చూపరులను కలచివేసింది. అధికారులు దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.