ఏపీలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని తరచూ విమర్శలకు గురవుతున్నారు. ఎక్కువ మంది ఈ తరహా వార్తలతోనే పతాక శీర్షికల్లో ఉంటున్నారు. తాజాగా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే కరోనా వ్యాక్సిన్ వేయించుకుని వివాదానికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ కు తాజాగా వ్యాక్సిన్ వేశారు.
ప్రముఖులందరూ వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకుంటుండగా ఆయన మాత్రం అందుకు భిన్నంగా వైద్య సిబ్బందిని తన ఇంటికే పిలిపించుకున్నారు. బుధవారం శంఖవరం పీహెచ్సీ వైద్య సిబ్బంది ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వేశారు. ఎమ్మెల్యేగా ఆయన పీహెచ్సీకే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని అందరికి ఆదర్శంగా నిలవాలని.. కానీ అందుకు ఆయన విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి.