చంద్రబాబునాయుడి సభపై రాళ్ల దాడి
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న బహిరంగసభలో గుర్తుతెలియని దుండగులు రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో ఓ మహిళకు, ఓ యువకుడికి గాయాలయ్యాయి. దీంతో ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు తన వాహనం దిగి అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న తనకే భద్రత లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్యులకు ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇది పరికిపందల చర్య అంటూ చంద్రబాబు మండిపడ్డారు. నిరసన తెలియజేయవద్దంటూ పోలీసులు కోరగా ఎలా న్యాయం చేస్తారో చెప్పండంటూ బాబు నిలదీశారు. రౌడీయిజం నశించాలంటూ నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈనెల 17వ తేదీన తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున పనబాక లక్ష్మి, వైసీపీ తరఫున గురుమూర్తి, జనసేన-బీజేపీ తరఫున ర్నతప్రభ, కాంగ్రెస్ తరఫున ఆరుసార్లు ఎంపీగా గెలిచిన మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ పోటీపడుతున్నారు.