బ్రేకింగ్ : చుండూరు మ‌హిళా ఎస్సై శ్రావ‌ణి చికిత్స పొందుతూ మృతి

N.V.Prasd
గుంటూరు : చుండూరు పోలీస్ స్టేష‌న్ మ‌హిళా ఎస్సై శ్రావ‌ణి  మృతి చెందారు. గ‌త శ‌నివారం శ్రావ‌ణితో పాటు అదే పోలీస్ స్టేష‌న్ లో ప‌ని చేస్తున్న కానిస్టేబుల్ ర‌వీంద్ర ఇద్ద‌రు పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించారు.కాగా వీరిద్దరిని మెరుగైన వైద్యం కోసం వేరేవేరు ప్ర‌వేట్ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారుఅయితే ఈ రోజు తెల్ల‌వారుజామున శ్రావ‌ణి చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.
పుకార్లే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మా...?
చుండూరు పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యకు పుకార్లే కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. ఎస్సై, కానిస్టేబుల్ ఇద్ద‌రు సన్నిహితంగా ఉండ‌టంపై పుకార్లు పుట్టాయ‌ని స‌మాచారం.దీనిపై మ‌న‌స్థాపం చెందిన శ్రావ‌ణి,ర‌వీంద్ర‌లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నంకి ఒడిగట్టారు.అయితే శ్రావణి మాత్రం రవీంద్ర ను సోదరుడుగా భావించింది.ఆమె కుటుంబ సభ్యులు సైతం రవీంద్రను పెద్దకొడుకుగా చూసుకుంటూ కలివిడిగా ఉన్నారు.కానీ స్టేష‌న్ ప‌రిధిలో వీరిద్ద‌రిపై పుకార్లు రావ‌డం కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని స‌న్నిహితులు అంటున్నారు.  ఎస్సై శ్రావ‌ణి స్వ‌స్థ‌లం ప్ర‌కాశం జిల్లా కందుకూరు కాగా..కానిస్టేబుల్ ర‌వీంద్ర స్వ‌స్థ‌లం గుంటూరు జిల్లా కార్ల‌పాలెం .
2018 బ్యాచ్‌కి చెందిన పిల్లి శ్రావ‌ణి మొద‌టి పోస్టింగ్‌లో గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుప‌ట‌లోని దిశ‌పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తించారు.ఆ త‌రువాత గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో చుండూరు పోలీస్ స్టేష‌న్ లో ఎస్సైగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.ర‌వీంద్ర చుండూరు పోలీస్ స్టేష‌న్‌లోనే గ‌త ఐదేళ్లుగా కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి రెండు రోజుల ముందు ఆయ‌న్ని ఉన్న‌తాధికారులు వీఆర్‌కి బ‌దిలీ చేశారు.వీరిద్ద‌రూ ఒకే సారి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం ఇప్పుడు పోలీస్‌శాఖ‌లో క‌ల‌కలం రేపుతుంది.పుకార్లు కార‌ణంగానే ర‌వీంద్ర‌ను వీఆర్‌కు బ‌దిలీ చేశారేమే అని తోటి ఉద్యోగులు అంటున్నారు.అయితే ఇద్ద‌రిపై ఉన్న‌తాధికారుల వేధింపులు కూడా ఉన్నాయ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.శ్రావ‌ణి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్ర‌భుత్వం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానిస్టేబుల్ ర‌వీంద్ర ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉన్న‌ట్లు తెలుస్తుంది.ఈ ఘ‌ట‌న‌పై చుండూరు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: