రేపు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేబినెట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ పరిస్థితులు, ఉచిత టీకా పంపిణీ అంశాలపై ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధాని మోడీ నిన్న సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగంలో జూన్ 21 నుండి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ లు వేస్తామని ప్రకటించారు.
అంతే కాకుండా వ్యాక్సిన్ ల బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోఉచిత వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అంశం పై చర్చించనున్నారు. అంతే కాకుండా కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.