ఏపీలో నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న చర్చలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్లతో పాటు నెల్లూరు ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే పడింది. అయితే అందరూ సీనియర్లే కావడంతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన నేతలు.. రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ఉండడంతో ఎవ్వరూ కూడా పార్టీ అధిష్టానం సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్లడం లేదు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలనే అనేక విధాలుగా అణగదొక్కుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ మంది ఉండడంతో ఆ వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ ఆ జిల్లాలో ప్రజాప్రతినిధులు, పార్టీ పరిస్థితిపై రిపోర్టు తెప్పించుకున్నారని తెలుస్తోంది.