బెంగళూరు నగరంలోని అనేక ప్రదేశాల్లో ఈ రోజు మధ్యాహ్నం వినిపించిన భారీ శబ్దాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. కొందరు సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ఇక శుక్రవారం అనగా ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ శబ్ధాలు వినిపించాయని అంటున్నారు. ఇటువంటి చప్పుళ్ళు ఇస్రో లే అవుట్, హెచ్ఎస్ఆర్ లే అవుట్, బెన్సన్ టౌన్, షార్జాపూర్, ఉల్సూర్, సౌత్ బెంగళూరు, ఈస్ట్ బెంగళూరు, జేపీ నగర్ లాంటి ఏరియాలలో వినిపించినట్లు సమాచారం. ఇలాంటి శబ్దాలు తమకు గత సంవత్సరం కూడా వినిపించాయని, ఇలా తరచుగా వినిపిస్తూ ఉంటాయని అంటున్నారు. ఈ శబ్దాల వల్ల కిటికీలు కదిలాయని తెలిపారు. కిటికీలు వణికేంత భారీ శబ్దం వచ్చిందని, ఇది మరో సోనిక్ బూమ్? ఏమో అని సోషల్ మీడియా ద్వారా ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న్నారు. కొందరు నెటిజన్ల అభిప్రాయం మేరకు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయం నుంచి యుద్ధ శిక్షణ విమానం ఆకాశయానం ప్రారంభించడంతో ఈ భారీ శబ్దాలు వినిపించినట్లు భావిస్తున్నారు. అయితే ఇందుకు హెచ్ఏఎల్ నిరాకరించింది.