వైయస్సార్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కి సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీన నేరుగా 60,55,377 మంది లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ చేతికి అందించేందుకు ఏర్పాట్లను చేశామని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ మొత్తాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పం లో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆగస్టు 1న తెల్లవారుజాము నుండే వాలంటీర్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1455.87 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారని అన్నారు. వాలంటీర్లు పెన్షనర్లకు ఇంటికి వచ్చి చేతిలో పెన్షన్ పెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారని అన్నారు. అంతేగాకుండా లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్ బి ఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మూడు రోజుల్లో వందశాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.