హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ఓ పాస్టర్ ను అరెస్ట్ చేశారు. వైజాగ్ కు చెందిన హనీ జాన్సన్ అనే ఓ పాస్టర్ యూట్యూబ్ లో మతపరమైన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. తన వీడియోలలో హిందు దేవుళ్లను, మహిళలను కించపరిచేలా ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
దాంతో హనీ జాన్సన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం హనీ జాన్సన్ ను 14 రోజుల రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో హనీ జాన్సన్ పై మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదు కాగా మరో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే హనీ జాన్సన్ అరెస్ట్ పై స్పందించిన ఆయన సన్నిహితులు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.