ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పులివెందులలోని వివేకానందరెడ్డి నివాసంలో సీబీఐ అధికారులు రెండోరోజు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున హంతకులు బైక్‌లో ఎలా వచ్చారు.. ఇంట్లోకి ఎవరెవరు వెళ్లారు.. బయట నుంచి వచ్చిన హంతకులు వివేకానంద రెడ్డి బెడ్ రూమ్‌లోకి ఎలా వెళ్లారు.. హత్య తర్వాత మారణాయుధాలతో ఎటువైపు వెళ్లారు.. వాటిని ఎక్కడ పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొందరికి షార్ట్ లెటర్స్ ఉన్న టీ షర్ట్‌లు ధరింపజేసి రిహార్సల్ చేయించారు.. షార్ట్ కట్‌లో ఉన్న పేర్లు సునీల్, దస్తగిరి, ఉమాశంకర్, రంగన్నవిగా తెలుస్తోంది. ఈ రిహార్సల్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇక పులివెందులలోని రోటరీపురం వంకలోనూ అధికారులు వీడియో తీశారు. వివేకానంద రెడ్డి నివాసం వద్ద సీబీఐ అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండటాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు. అయితే సీబీఐ అధికారులు, పోలీసులు.. స్థానికులను వివేకా నివాసం వద్దకు రాకుండా కట్టడి చేస్తూ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను నిర్వహిస్తున్నారు.