నరేష్ కృష్ణుడైతే విష్ణు అర్జునుడా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతిష్ట మాసకబారిపోతున్న సమయంలో తాను సంయుక్త కార్యదర్శిగా గెలిచానని, అధ్యక్షుడిగా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చానని మా ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ అన్నారు. తాను కృష్ణుడినని, అందుకే మంచు విష్ణు రథం ఎక్కుతున్నానని, అతన్ని అధ్యక్షుణ్ని చేసే బాధ్యత తీసుకుంటున్నానని నరేష్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విష్ణు, శివబాలాజీ తదితరులుతో కలిసి మీడియాతో మాట్లాడారు. జయసుధ పోటీచేస్తున్న సమయంలో దాసరి నారాయణరావు ఉపాధ్యక్షుడిగా చేయమన్నారని, ఆ తర్వాత సంయుక్త కార్యదర్శిగా చేయమన్నారని, తనకు స్థాయితో సంబంధంలేదని, ఏ పదవిచ్చినా పోటీచేస్తానన్నానని, ఆ సమయంలో జయసుధ ఒక్కరే ఓడిపోవడం బాధకలిగించిందన్నారు. ఎవరు పడితే వారు అధ్యక్షుడైతే మాను నిర్వహించడం కష్టమని, విష్ణు అయితే ఇక్కడే ఉంటాడుకాబట్టి అతనికి మద్దతు తెలియజేస్తున్నానన్నారు. మసకబారిపోతున్న మాను వెలుగులోకి తీసుకురావాలని తాను ప్రయత్నించానన్నారు. ప్రకాష్‌రాజ్ తనకు మంచి స్నేహితుడన్నారు.