బెంగళూరులో భారీగా ఐటీ దాడులు?
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి దాడులు చేస్తున్నారు. దాదాపు 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 120 కార్లు సీజ్ చేసినట్లు సమాచారం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేష్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అమిత్‌కు చెందిన కార్యాలయాలు, ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఆడిటర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలపై అధికారులు దృష్టిసారించారు. అలాగే కర్ణాటక జలవనరులశాఖలో కాంట్రాక్టు చేసేవారిపై కూడా దాడులు జరుగుతున్నాయి. యడ్యూరప్ప సన్నిహితుడిపై దాడులు జరగడం, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంలో ఎవరి పాత్ర ఉందనే విషయమై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. భారతీయ జనతాపార్టీకి విధేయుడిగా ఉన్న యడ్యూరప్ప ఆ తర్వాత తన సామాజికవర్గం ద్వారా ఎదురుతిరగకుండా ఉండేందుకు పార్టీ నేతలు ఇలా చేయించి ఉండొచ్చనే ఊహాగానాలు రేకెత్తుతున్నాయి.