కేంద్రానికే గతిలేదు.. మనకేమిస్తది..?
తెలంగాణలో త్వరలోనే కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి నుంచి 1500 మందిని ఎంపిక చేస్తామని, వారందరికీ వారి సొంతభూమిలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించబోతున్నామన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను అధికారులు ఖరారు చేస్తున్నారన్నారు. కేంద్రానికి ఆదాయం ఇచ్చే రాష్ట్రాలు నాలుగు లేక ఐదే ఉన్నాయని, వాటిల్లో తెలంగాణ ఒకటన్నారు. మనమిస్తేనే కేంద్రానికి ఆదాయమని, కేంద్రానికే లేనప్పుడు మనకేమిస్తుందని ప్రశ్నించారు. భారతీయ జనతాపార్టీ నేతలు ఇకనైనా కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇస్తుంది.. వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. మంచిగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కొంతమంది చిల్లర విమర్శలు చేస్తున్నారని, మీ జేబులో నుంచి డబ్బులు తీస్తున్నారా? అంటూ మాట్లాడుతున్నారని కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మీకు వ్యవసాయం రాదు.. తెలివితేటలు లేవు అంటూ హేళన చేశారని, వారినుంచి విడిపోయిన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలుగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలుగా ఉందన్నారు.