MAA: నటీనటుల నటన నభూతో..
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు భారీ తేడాతో ఘనవిజయం సాధించారు. పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, ఎవరు గెలిచినా స్వల్పతేడాతో గెలుస్తారనే అంచనాలను పటాపంచలు చేస్తూ ప్రకాష్‌రాజ్‌పై 101 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. మంచు విష్ణుకు 385 ఓట్లు పోలవగా, ప్రకాష్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అంతేకాకుండా విష్ణు ప్యానెల్ తరఫున పోటీచేసినవారు కూడా గెలుపొందారు. మొదటి నుంచి మా ఎన్నికలకు అధ్యక్షుడంటే ఎవరో ఒక నటుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. అసలు ఆ ఎన్నికలు ఉన్నాయనే విషయంకానీ, జరిగిన తర్వాత ఎన్నికలు జరిగాయనే విషయం కానీ ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఈసారి రాజకీయ ఎన్నికలకన్నా హోరాహోరీగా జరగడంతోపాటు ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తించాయి. పోలింగ్ జరిగేతీరుతోపాటు ఫలితాలు వెల్లడి సమయంలోకూడా వాతావరణం అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. మొత్తానికి మా గురించి ఎవరూ పట్టించుకోని సమయంలో అందరూ మాట్లాడుకునేలా రాజకీయం చేసిన నటుల నటనపై ప్రజలు చర్చించుకుంటున్నారు.