పీలేరు తహసీల్దార్‌ ఆఫీసులో కరోనా కలకలం

N.Hari
చిత్తూరు జిల్లా పీలేరు తహసీల్దార్‌ రవి, డిప్యూటీ తహసీల్దార్‌ జయసింహలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తహసీల్దార్‌ కార్యాలయాన్ని మూసివేశారు. రెండు రోజులపాటు తహసీల్దార్‌ కార్యాలయానికి సెలవు ప్రకటిస్తూ కార్యాలయం ముందు నోటీసు బోర్డు అంటించారు. కార్యాలయానికి తాళం వేశారు. పీలేరు మండల ముఖ్య అధికారులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కారణంగా తహసీల్దార్‌ కార్యాలయానికి మూతపడటం ప్రజలకు ఇబ్బందిగా మారింది. తమ సమస్యలు విన్నవించుకోవడానికి, వాటి పరిష్కారం కోసం, ఇతర పనుల నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే ప్రజలు.. అసలు విషయం తెలిసి ఉసూరుమంటూ తిరిగి వెళుతున్నారు. ఓ వైపు ఆసరా, మరోవైపు విద్యార్థుల కౌన్సెలింగ్‌ ఉండటంతో.. వాటికి అవసరమైన ధృవపత్రాల కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అయితే కార్యాలయం రెండు రోజులపాటు మూసి ఉంటుందని తెలిసి హైరానాకు గురవుతున్నారు. మరోవైపు కార్యాలయంలోని ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాల కోసం ఇటీవల పీలేరు తహసీల్దార్‌ ఆఫీసుకు వెళ్లినవారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: