బంధాలూ అనుబంధాలు అన్నవి రాజకీయంలో ఉండవు. కేవలం అవి కొంత వరకే ప్రభావితం చేస్తాయి. కొంత పరిధి మేరకే ఆలోచింపజేస్తాయి. పరిధి దాటాక ఓడిపోయినవి కొన్ని, గెలిచినవి కొన్ని. ఈ సందర్భంలో కొందరు తమ మాట నెగ్గిందని ఆనందిస్తారు. ఇంకొందరు మరికాస్త బాధపడి కుమిలిపోతారు. నిరాశకు లోనయి తమని తాము మరో సారి తగ్గించుకునే ప్రయత్నమేదో చేస్తారు. ఇప్పుడు
హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గరకే వద్దాం. ఇక్కడ నిన్నటి వేళ గెల్లు శ్రీను, ఈటెల తలపడ్డారు. పాపం గెల్లు శ్రీను చాలా చిన్నోడు. ఇంకా చెప్పాలంటే ఈటెలతో పోలిస్తే సరైన ఆర్థిక మూలాలు లేనోడు.
కేసీఆర్ వెన్నుదన్నుతో నిల్చొన్న ఒకప్పటి విద్యార్థి నేత. కానీ ఈటెల అలా కాదు. సీనియర్ పొలిటీషన్.
హుజురాబాద్ కు జరిగిన మూడో ఉప ఎన్నికలో పాల్గొన్న ధీరుడు. విపత్కర పరిస్థితుల్లో నెగ్గిన లేదా నెగ్గాలన్న పంతం ఉన్న ధీరుడు. ఒకప్పుడు
కేసీఆర్ కు స్ట్రాటజిస్టు. ఉద్యమ సహచరుడు. ఆస్తులున్న వాడు.
రెడ్డి కుటుంబానికి అల్లుడు. ఇవన్నీ ఆయనకు అదనపు బలాలు. ఇదే సమయంలో ఇదే అదునుగా బండి సంజయ్ తెరవెనుక రాజకీయం నడిపాడు. గులాబీ దండుతో గతంలో ఉన్న అనుబంధం రీత్యా ఆయన పావులు కదిపాడు ఈ రాజకీయ చదరంగంలో! ఇంకా చెప్పాలంటే ఫక్తు
టీఆర్ఎస్ ఏజెంట్ గా పనిచేశాడు. ఇవీ ఆయనపై వినిపిస్తున్న ఆరోపణలు. వీటిలో నిజాలెన్నో అబద్ధాలెన్నో అన్నది తేలాలి. అంటే మనం ఇంకొద్ది కాలం ఆగాలి.