తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుపై మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడారు. సిద్ధిపేట నియోజకవర్గం ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసారు. హరీశ్‌రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికి ఆయన బలి అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు ఈటల.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల వేళ దళిత బంధు అమలు చేశారని, ఆ దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమలు చేయాలని డిమాండ్ చేసారు. సిద్దిపేటలో కూడ త్వరలో దళిత గర్జన పెట్టే రోజు వస్తుందని.. తానే నాయకత్వం వహిస్తాను అని ప్రకటించారు ఈటల. హరీశ్‌రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో నన్ను ఓడించడానికి ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నాపై నమ్మకంతో పట్టం కట్టారని వెల్లడించారు.