2023 అంబేడ్కర్ జయంతి నాటికి ఆంధ్ర ప్రదేశ్ నడిబొడ్డున ఉన్న విజయవాడలో బాబా సాహెబ్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విగ్రహం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ విషయాన్ని ఛాలెంజ్ చేసి మరీ ప్రతిపక్షాలకు చెబుతున్నామంటున్నారాయన. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ విషయం చెప్పారు. అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం అంటూ చంద్రబాబు 5 ఏళ్ళు కాలయాపన చేసి, ఆఖరికి పిచ్చి మొక్కలకు ఆలవాలంగా మార్చారని ఆయన టీడీపీపై మండిపడ్డారు. అలాంటి టీడీపీ నేతలు మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలంలో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అక్కడే స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.