దాదాపు 10 నెలల క్రితం నడిరోడ్డుపై ఓ యువకుడి చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం ఆదుకుంది. ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి విలువైన 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఈ విషయాన్ని హోం మంత్రి తానేటి వనిత మరోసారి గుర్తు చేశారు. రమ్య హత్య కేసులో కేవలం 10 నెలల్లో తీర్పు వచ్చేలా కృషి చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. దిశ ఘటన జరిగిన తెలంగాణలోనూ దిశ లాంటి చట్టం లేదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడ అత్యాచార ఘటనలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంటనే చర్యలు తీసుకున్నామని హోంమంత్రి వనిత అన్నారు. ఇక విశాఖ మన్యంలో గంజాయి సాగు ఇవాళ్టిది కాదన్న తానేటి వనిత... గంజాయి పండించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ స్థాయిలో డ్రగ్స్ వినియోగం, పబ్ కల్చర్ ఏపీలో లేదని హోంమంత్రి తెలిపారు. దిశా యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. ఇప్పటి వరకూ దిశా యాప్ ద్వారా 900 మందిని పోలీసులు రక్షించారని తానేటి వనిత తెలిపారు.