జడ్జిలతో జగన్.. ఇవాళ కీలక భేటీ?
ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు, ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి దేశ రాజధానికి చేరుకున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మాత్రం ఈ సదస్సుకు హజరు కావట్లేదు. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానంలో తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరవుతారు. ఈ సదస్సు రోజంతా జరగుతుంది.
ఈ సదస్సులో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి అవసరమైన చర్యలపై చర్చిస్తారు. అలాగే న్యాయాన్ని సరళంగా, సౌకర్యవంతంగా అందించడానికి అవసరమైన ఫ్రేమ్ వర్క్‌లను గురించి చర్చిస్తారు. కార్యనిర్వాహక మరియు న్యాయవ్యవస్థ కలిసి చర్చలు జరపడానికి ఇదో వేదిక అని ప్రధాని కార్యాలయం చెబుతోంది. 2016 సదస్సు తర్వాత నుంచి ప్రభుత్వం మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద కోర్టు ప్రక్రియల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచిందని గుర్తు చేస్తోంది పీఎంఓ. డిజిటల్ టెక్నాలజీని అనుసంధానం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం.. న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడంపై ఈ సదస్సులో చర్చిస్తారు. కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ, న్యాయవ్యవస్థలో సంస్కరణలు, అధునాతన వ్యవస్థలను న్యాయవ్యవస్థకు అనుసంధానం చేయడం గురించి కూడా చర్చిస్తారు. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని కోర్టు సముదాయాల్లో నెట్‌వర్క్, అనుసంధానతను బలోపేతం చేయడం, జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు మానవ వనరులు, సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పనపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.