ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రశాంత్ కిశోర్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇన్నాళ్లూ అనేక పార్టీల కోసం పని చేస్తూ వచ్చిన ప్రశాంత్ కిషోర్.. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. ఇకపై పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. తాను పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానన్న పీకే.. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం తాను పనిచేశానని అంటున్నారు. ఇక ఇప్పుడు తన రాజకీయ ప్రయాణాన్ని బిహార్ నుంచి ప్రారంభిస్తానని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. పీకే తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆయన కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని అంతా భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే జన్ సురాజ్ పేరుతో ఓ రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించారని ప్రచారం జరుగుతోంది. అంటే త్వరలోనే పీకే పార్టీ పెట్టేస్తాడన్నమాట.