జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 5న విజయదశమి రోజున... తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించబోతున్నారు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ యాత్ర విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జనసేన నాయకుడు నాగబాబు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దసరా రోజున ప్రారంభించిన ఆరు నెలల్లో రాష్ట్రమంతటా పర్యటించనున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ ఇక ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటన ఉండేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని జనసేన నేతలు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి కదా.. అందుకే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదన్న భావనలో జన సేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు.