సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. సీపీఎస్ రద్దు చేయలేమని తేల్చి చెప్పిన ప్రభుత్వం వారి ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది. సీపీఎస్ బదులుగా జీపీఎస్ అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ... జీపీఎస్ వల్ల నష్టమని ప్రభుత్వానికి తాము నివేదిక రూపంలో చెప్పామని తెలిపారు. జీపీఎస్ తమకు ఆమోదం కాదని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా గతంలోనూ తెలిపామన్నారు.
కానీ.. ఉద్యోగులకు రిటైర్డ్ అనంతరం 33శాతం గ్యారెంటెడ్ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం అంటోందని సూర్య నారాయణ తెలిపారు. అలాగే ఉద్యోగికి ప్రమాద, హెల్త్ బీమా, స్పౌజ్ పెన్షన్, పదివేల మినిమం పెన్షన్ ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. మరి ఈ తాయిలాలకు ఉద్యోగులు లొంగుతారా.. ఇంతకు మించి ఇవ్వలేమంటున్న ప్రభుత్వంతో రాజీ పడతారా అనేది వేచి చూడాలి.