తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పశుమాంసం ఎగుమతి చేపట్టే అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ దాడులు జరిగాయి. ఈ నెల 15 నుంచి సోదాలు కొనసాగాయి. ఇప్పటికే లెక్కలు చూపని 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు తెలుస్తోంది. మాసం ఎగుమతుల్లో ఉప ఉత్పత్తుల విక్రయాల్లోనూ బిల్లులు లేకుండా నగదు లావాదేవీలు జరిపినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే కోణంలో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. మాంసం ఉప ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి లెక్కలు చూపిన నగదు లావాదేవీలు కూడా కోట్లలోనే ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.
అల్ సమీ ఆగ్రో ప్రొడక్ట్స, ఆయిల్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్, అల్ సమీ ఫుడ్ ప్రొడక్ట్స్ లలో తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. అల్ సమీ గ్రూపు సంస్థల అధినేత మహ్మద్ అబ్దుల్లా, నలుగురు డైరెక్టర్లు, ఇళ్లు కార్యాలయాల్లో 15 బృందాలు ఐదు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు.