మానసిక సమస్యల పరిష్కారానికి ఏపీ వైద్యారోగ్యశాఖ విజయవాడ సిద్ధార్ధ వైద్యకళాశాలలో టెలిమానస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మానసిక సమస్యల కోసం 14416 లేదా 180089114416 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి టెలీ కౌన్సెలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ టెలీ మానస్ కేంద్రం ద్వారా సేవలు అందుతాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మానసిక సమస్యలు ఉన్న వారికి టెలిఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ద్వారా సూచనలు సలహాలు అందించనున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో పది శాతం మంది ప్రజలు మానసిక ఒత్తిళ్ళు, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు తేలిందని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఆర్థిక, సామాజిక సమస్యలు, పరీక్షలు, ఉద్యోగాన్వేషణలో తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టుగా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిళ్లు 90 శాతం మానసిక రుగ్మతల్ని కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించి ఆత్మహత్యల్ని నివారించే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.