ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నహాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ములుగు జిల్లా మేడారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 4.30 గంటలకు రేవంత్ యాత్ర పస్రా గ్రామానికి చేరుకుంటుంది.
టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహించి.. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆరు నెలలపాటు పూర్తిగా జనంలోనే ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలల్లో పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.