ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయ్యింది. ఓ పబ్ వద్ద జరిగిన ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలేమైందంటే.. జూబ్లీహిల్స్లో రోడ్డు నెంబర్ 10లోని 0-40 పబ్బు వద్ద ఇరు వర్గాల కు చెందిన యువకులైన సమద్, సిద్దార్ధ వర్గాల మధ్య యువతి విషయంలో గొడవ జరిగింది. సమద్ వర్గంలో ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ కూడా ఉన్నాడు.
సమద్ డేవిడ్ సవాంగ్ స్నేహితుడు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం రాత్రి ఇరు వర్గాలు పబ్ బయట దాడులకు దిగాయి. ఘటనలో సిద్దార్ధ్ కు గాయాలయ్యాయి. గొడవపై ఇరు వర్గాలు పరస్పరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు ఇరు పక్షాల పై కేసు నమోదు చేశారు.