ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కు బెయిల్ లభించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో అడుగుపెట్టిన చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన గన్నవరం నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రాగా ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు బేగంపేటకు వచ్చారు. అక్కడ నుంచి చంద్రబాబుకు జూబ్లీహిల్స్ నివాసం వరకు ర్యాలీగా వచ్చారు. దారి పొడువునా చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చిన చంద్రబాబుపై అభిమానులు పూల వర్షం కురిపించారు. బాబు వాహన శ్రేణి అంతా పూలమయంగా మారింది. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో బేగంపేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చంద్రబాబు వెంట విమానంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా హైదరాబాద్ వచ్చారు.