విజయశాంతి పార్టీ మారడంపై వస్తున్న విమర్శలపై ఆమె తీవ్రంగా స్పందించింది. ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె తనను విమర్శించే వాళ్లకు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది....అక్కడకు వెళ్లిన తరువాత ఏమి జరిగిందో వివరించింది. రాములమ్మ పార్టీ మారారని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలని సూచించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏడు సంవత్సరాలు జెండా మోసి కొట్లాడింది తానేని విజయశాంతి వివరించారు. నాడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇంకొందరు బీజేపీ ప్రముఖులు అనేకసార్లు బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడతాదిని చెప్పి తనను వివేక్ వెంకటస్వామిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒప్పించారని వివరించారు. కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి తనను చేర్చుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలని, తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ను వదిలి బిజేపికి వెళ్లినట్లు పేర్కొన్నారు.