తెలంగాణలో భాజపా పోటీ చేస్తున్న 111 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ కు ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల ఓట్లు ఉంటాయని భావిస్తున్నారు. అవన్నీ భాజపాకు అనుకూలంగా మారుతాయని అంచనా వేస్తున్నారు. భాజపా తీసుకున్న బీసీ నినాదం, ఎస్సీ వర్గీకరణకు జనసేన మద్దతు పలుకడం కూడా తమకు కలిసి వస్తుందని ఇరుపార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. భాజపాతో జట్టు కట్టడం వల్ల 8 నియోజకవర్గాల్లో తమ పార్టీ బలం పుంజుకుంటుందని జనసేన అభిప్రాయపడుతోంది. ఈ పొత్తు వల్ల రాష్ట్రంలో భాజపా 40 నుంచి 45 సీట్లు గెలుస్తారనే ధీమా వ్యక్తమవుతోంది.
తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంతోపాటు భాజపా అభ్యర్థుల ప్రచారంలోనూ జనసేనాని రంగంలోకి దిగబోతున్నాడు. ఈ నెల 26న కూకట్ పల్లితోపాటు తాండూరు సహా మరో రెండు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే భాజపా అగ్ర నాయకులతో కలిసి రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల సభలకు హాజరవుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.