సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఫ్లైఓవర్ల వంటి నిర్మాణాలకు భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం చెప్పడంతో మరోసారి రాజకీయం మొదలైంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ మార్గాల్లో రెండు ఫ్లైఓవర్లకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చినందున ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణాలను అత్యధిక ప్రాధాన్యతా క్రమంలో పెట్టుకొని పనులు చేపట్టాలని కేటీఆర్ అంటున్నారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రేవంత్ సర్కారుకు కేటీఆర్ సూచనలు చేశారు.
ఎలివేటెడ్ ఫ్లైఓవర్లతో హైదరాబాద్ నలుదిశలా విస్తరించడంతో పాటు ప్రతి మార్గంలో ప్రగతిపథంలో దూసుకుపోయేందుకు మార్గం సుగమమైందని కేటీఆర్ అన్నారు. తమ పోరాటాన్ని గుర్తించి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కేటీఆర్ తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు భారాస పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులు, యంత్రాంగానికి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.