జీవో నంబరు 3పై ఎమ్మెల్సీ కవితతో చర్చించేందుకు తాము సిద్దమని కాంగ్రెస్ ప్రకటించింది. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్న కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు తాము అమలు చేస్తున్నందునే తమపై కుట్ర పూరితమైన, అసత్య ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారన్నారు. తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రంలో మహిళలు ఇబ్బంది పడినా ఎప్పుడు కవిత మాట్లాడలేదని బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. లీగల్ పాయింట్స్ అంటూ రోస్టర్ విధానంను తెర మీదికి తీసుకు వచ్చి నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు.
జీవో నంబరు 3 వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు, మహిళలకు ఎలాంటి అన్యాయం జరగదని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మూడు రోజుల లోనే టిఎస్పిఎస్సీ ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్న వెంకట్ త్వరలో జాబ్ కేలండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు, మహిళలకు చేసిన పనులపై తాము చర్చకు సిద్దమన్న వెంకట్ బీఆర్ఎస్లో మహిళ అంటే కవిత మాత్రమే కనిపించేదని ఎద్దేవా చేశారు.