షర్మిల పార్టీ అదే ఏపీ కాంగ్రెస్తో పొత్తుకు ఓ పార్టీ తాపత్రయపడుతోంది. ఏపీలో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే విషయమై చర్చించేందుకు ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో హైదరాబాద్లోని లోటస్ పాండ్లో విడుతలై చిరుతైగల్ కట్చి అనే తమిళ పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ భేటీ అయ్యారు. 19 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు తమకు ఇవ్వాలని తిరుమావళవన్ కోరారు. బీజేపీను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధం అని తిరుమావళవన్ చెప్పారు. హిందూ ఓట్లను కొల్లగొట్టడానికి మోదీ ప్రభుత్వం ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టంను తెరపైకి తెచ్చిందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తిరుమావళవన్ అన్నారు.
రాజ్యాంగ విరుద్ధంగా చేసిన ఈ చట్టంపై తాము బీజేపీయేతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని తిరుమావళవన్ అన్నారు. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారికి ఇందులో అవకాశం కల్పించకపోవడం పెద్ద కుట్ర ఉందన్న తిరుమావళవన్.. ఎన్నికల బాండ్ల అంశంపై ప్రజల దృష్టి మరల్చేందుకే దీన్ని తెరపైకి తెచ్చారన్నారు. పొత్తుల విషయం పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని షర్మిల చెప్పారని తిరుమావళవన్ మీడియాకు తెలిపారు.