తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్ భవన్ లో ఉదయం 11 గంటల 15 నిమిషాలకు రాధాకృష్ణన్ తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయిస్తారు. తమిళిసై రాజీనామా చేయడంతో.. జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాంచీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా తమిళిసై స్థానంలో రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపడతారు. సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్రానికి మూడో గవర్నర్ గా చెప్పుకోవచ్చు. రాష్ట్రావిర్భావం నుంచి 2019 సెప్టెంబరు 7 వరకు ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్గా ఉన్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 8 నుంచి ఇప్పటి వరకు తమిళిసై గవర్నర్ గా వ్యవహరించారు. ఇప్పుడు సీపీ రాధాకృష్ణన్ వచ్చారు.